prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 9:57 am Digital Edition : PRAJA VANI

కుక్కల దాడి నుంచి కొండగొర్రెను కాపాడిన యువకులు

కుక్కల దాడి నుంచి కొండగొర్రెను కాపాడిన యువకులు

పరిగి, అక్టోబర్ 16( ప్రజావాణి)

ఆహారం, తాగునీరు వెతుక్కుంటూ అడవి నుంచి దారితప్పి వచ్చిన ఓ కొండగొర్రె శుక్రవారం కులకచర్ల శివారు ప్రాంతంలో కలకలం సృష్టించింది. రామలింగేశ్వర కళాశాల సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తున్న ఈ మూగజీవిని చూసి వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడికి దిగాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు ప్రాణభయంతో పరుగులు తీసిన ఆ కొండగొర్రె నేరుగా సమీప నివాసాల వైపు దూసుకొచ్చింది.
ఈ దృశ్యాన్ని చూసిన స్థానిక యువకులు సత్యం, అంజలయ్య, శ్రీను వెంటనే రంగంలోకి దిగారు. కుక్కలను బెదిరించి అక్కడి నుంచి తరిమికొట్టడమే కాకుండా, భయంతో వణికిపోతున్న కొండగొర్రెను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం తెలుసుకున్న వెంటనే ఫారెస్ట్ రేంజర్ పీర్యానాయక్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని కొండగొర్రెను స్వాధీనం చేసుకున్నారు. దానికి ప్రాథమిక చికిత్స అందించి, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం సురక్షితంగా తిరిగి అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. సమయస్ఫూర్తితో స్పందించి అరుదైన అటవీ జంతువు ప్రాణాలను కాపాడిన యువకుల చొరవను అటవీ, పోలీసు శాఖల అధికారులు అభినందించారు.