prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 7:42 pm Digital Edition : MAHESH MEDCHAL

కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ మహాధర్నా

కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ మహాధర్నా

అక్టోబర్ 25, 26 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద ఆందోళన

మేడ్చల్, అక్టోబర్ 24 (ప్రజా వాణి):

కేంద్ర బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 25, 26 తేదీల్లో నిర్వహించనున్న మల్టిపుల్ డేస్ మహాధర్నాను విజయవంతం చేయాలని మెడిసిటీ, మేడ్చల్ మున్సిపల్ కార్మికుల కమిటీల ఆధ్వర్యంలో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ మండల కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ అక్టోబర్ 25న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాలో రాష్ట్రంలోని ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. అక్టోబర్ 26న ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, బీడీ, భవన నిర్మాణ, రవాణా, హమాలీ తదితర అసంఘటిత రంగాల కార్మికులు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్మికవర్గం తమ సంఘటిత శక్తిని ప్రదర్శించి హక్కుల సాధన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి కార్మికుల సమస్యలకు పరిష్కారం సాధించేందుకు వేలాది మంది కార్మికులు మహాధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని నెలకు రూ.42,000లకు పెంచాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. జీఓ నంబర్‌ 6 వర్తించే అన్ని సంస్థల్లో పెరిగిన వేతనాలను అమలు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించి ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు.

ఫిక్స్‌డ్‌ టర్మ్‌, నాన్‌ రెగ్యులర్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని, బకాయి డీఏలను చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, స్కీమ్‌ వర్కర్లకు రాష్ట్ర పీఆర్సీ ప్రకారం కనీస వేతన స్కేల్‌ను రూ.30,000గా నిర్ణయించి అమలు చేయాలని కోరారు. వీరికి కూడా డీఏ వర్తింపజేయాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి అర్హులైన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాలను కోరారు.

ఈ కార్యక్రమంలో మెడిసిటీ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, యూనియన్‌ నాయకులు రాంచందర్‌, బిక్షపతి, జగన్‌ గౌడ్‌, రమేష్‌, భాగ్య, మున్సిపల్‌ యూనియన్‌ కార్యదర్శి మల్లేష్‌, గౌరవ అధ్యక్షుడు ప్రవీణ్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.