కామన్‌మ్యాన్‌గా వెళ్లి రేట్లు ఆరా తీసిన తహసీల్దార్ చిరంజీవి
లబ్ధిదారుల స్టేట్‌మెంట్లు నమోదు
ప్రజావాణి ప్రతినిధి మార్కాపురం(అక్టోబర్7):మార్కాపురం పట్టణం లోని కంభం రోడ్డులో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మార్కాపురం తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అయితే అధికారులు వచ్చినట్లు ముందుగా తెలియకుండా కామన్ మ్యాన్‌గా కేంద్రానికి వెళ్లి, ఆధార్ సేవలకు ఎంత వసూలు చేస్తున్నారో స్వయంగా ఆరా తీశారు.బయోమెట్రిక్‌కు ప్రభుత్వ నిర్దేశిత రుసుము రూ.120 ఉండగా, రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు తహసీల్దార్ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.అలాగే ఫోన్ నంబర్ మార్పు కోసం నిర్దేశిత రుసుము రూ.75 కాగా, రూ.150 వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.అక్కడ ఉన్న లబ్ధిదారుల వివరాల జాబితాను పరిశీలించిన తహసీల్దార్ కొంతమంది లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి వారి నుంచి వివరాలు సేకరించి స్టేట్‌మెంట్లను నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తాలు వసూలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయ సిబ్బందితో మాట్లాడిన తహసీల్దార్ ప్రభుత్వం నిర్దేశించిన రుసుములకే ఆధార్ సేవలు అందించాలని, నిబంధనలు పాటించే వారితోనే ఆధార్ కేంద్రం నిర్వహించాలని సూచించారు.ఇకపై అధిక మొత్తంలో వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.