గడ్డం వెంకటస్వామి 97వ జయంతి వేడుకలు
జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి అక్టోబర్ 05(ప్రజావాణి):
దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పేదల పక్షపాతి గడ్డం వెంకటస్వామి (కాక) 97వ జయంతి వేడుకలు ఎండపల్లి మండలం రాజారంపల్లి గ్రామంలోని మినీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మద్దుల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ… 1929లో జన్మించిన వెంకటస్వామి, 1957 నుండి 2009 వరకు సుదీర్ఘ ప్రజా జీవితంలో కొనసాగారని గుర్తుచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాష్ట్ర కార్మిక, పౌర సరఫరాల శాఖ మంత్రిగా, ఏడుసార్లు ఎంపీగా ఆయన విశేష సేవలందించారని తెలిపారు. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో సప్లై, పునరావాస శాఖ డిప్యూటీ మంత్రిగా, పీవీ నరసింహారావు ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, జౌళి, కార్మిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. పేదలకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు అందించడంతో పాటు, నిరంతరం ప్రజలకు అండగా నిలిచారని, ఆయన సేవలకు గుర్తుగా ప్రజలు ప్రేమతో “గుడిసెల వెంకటస్వామి” అని పిలుచుకునేవారని తెలిపారు. కాక ఆశయాలను, సేవా స్ఫూర్తిని ఆయన వారసులు విశాఖ ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారని, ఆయన మార్గంలో నడవడమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గెల్లు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కందికట్ల రాజేష్, సర్పంచులు సంగ రమేష్ యాదవ్, కొంగల జగదీశ్వర్ రెడ్డి, నాయకులు బాలసాని మల్లేశం గౌడ్, పడిదం మొగిలి, కోడిపెల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్, యువ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.