కాకతీయ శిల్పకళా వైభవానికి నిదర్శనం కూసుమంచి శివాలయం
శివాలయ చరిత్ర, నిర్మాణ విశేషాలను విద్యార్థులకు వివరించిన చరిత్ర అధ్యాపకుడు సోమలింగం యాదవ్
కూసుమంచి అక్టోబర్ 26 ( మన ప్రజావాణి ) ప్రతినిధి RK :
విద్యార్థులకు చారిత్రక కట్టడాలు, ప్రాచీన నిర్మాణ శైలి, కాకతీయుల వాస్తు శిల్పకళపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం స్థానిక చారిత్రక శివాలయాన్ని సందర్శించారు. కళాశాలకు చెందిన 11, 12వ తరగతి విద్యార్థులు చరిత్ర అధ్యాపకుడు వర్రే సోమలింగం యాదవ్ ఆధ్వర్యంలో ఈ క్షేత్ర పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర, నిర్మాణ విశిష్టతలు, కాకతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఆయన విద్యార్థులకు వివరించారు.
సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కాకతీయుల వాస్తు, శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి కాలంలో నిర్మితమైన ఈ ఆలయం ప్రత్యేక నిర్మాణ శైలితో చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుందని వివరించారు.
శిల్పకళలో ప్రత్యేకతలు
ఆలయంలోని భారీ నల్లరాతి శివలింగం, త్రికూటాలయ నిర్మాణం, నక్షత్ర ఆకారంలో రూపొందించిన వేదిక ప్రత్యేక ఆకర్షణలని అధ్యాపకుడు వివరించారు. రాళ్లను సున్నం లేకుండా గాడులు, కూసల ద్వారా అనుసంధానించే పద్ధతి, ఇసుక పునాది నిర్మాణ విధానం కాకతీయుల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ప్రాచీన కాలంలోనే నిర్మాణ సాంకేతికతను వినియోగించిన విధానాన్ని విద్యార్థులకు తెలియజేశారు.
అలాగే సూర్యచంద్రుల కిరణాలు గర్భగుడిలోని శివలింగంపై పడేలా రూపొందించిన వాస్తు విజ్ఞానం, చెరువు–ఆలయం–పట్టణం అనుసంధానంతో కూడిన కాకతీయుల పట్టణ ప్రణాళిక విధానం గురించి వివరించారు.
పుస్తకాల్లో చదివిన చరిత్రను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా విద్యార్థులకు ప్రాచీన భారతీయ నిర్మాణ కళ, సాంకేతిక పరిజ్ఞానంపై మరింత అవగాహన కలుగుతుందని ఈ పర్యటన తెలియజేసింది.