*కరెంట్ కష్టాలు తీర్చకుంటే అసెంబ్లీ ముట్టడే!*
*విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలు*
*ఆందోళనలో రైతన్నలు
ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో గౌడిచర్ల రైతుల రాస్తారోకో*
*ప్రజావాణిలో కలెక్టర్‌కు రైతు నాయకుల వినతిపత్రం*
సంగారెడ్డి, అక్టోబర్ 12 (మన సమగ్ర ప్రజావాణి): ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు రోడ్డెక్కారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో పంటలకు నీరందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా గౌడిచర్ల గ్రామ రైతులు సోమవారం ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లి ప్రజావాణి కార్యక్రమంలో రైతు నాయకులు రాజమల్లేశం, కొలగల్ల నర్సింలు, సీపీఎం నాయకుడు రాజయ్య ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ గౌడిచర్ల గ్రామంలో విద్యుత్ సమస్య రైతుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, చెరకు తదితర పంటల సాగుతో పాటు పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ, ఆ సమయంలోనూ ఎల్‌సీ (లైన్ క్లియరెన్స్) పేరుతో కరెంట్ నిలిపివేస్తున్నారని ఆరోపించారు. దీంతో రోజుకు మూడు, నాలుగు గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందడం లేదని వాపోయారు. పది గుంటల భూమికి సైతం పూర్తిస్థాయిలో నీరు పారించలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండేదని, ప్రస్తుతం సరఫరా సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రకటించిన వేళల్లోనూ కోతలు విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటల సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టామని, విద్యుత్ అంతరాయాలతో నీరందక పంటలు ఎండిపోతుండటంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. యాసంగి పంటపై ఇప్పటికే ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కనీసం ప్రస్తుతం సాగులో ఉన్న పంటలనైనా కాపాడుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ సరఫరాకు నిర్ణయించిన సమయాన్ని కచ్చితంగా అమలు చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. ఎల్‌సీ పేరుతో విద్యుత్ నిలిపివేసిన సమయానికి బదులుగా అదనపు గంటలు సరఫరా చేయాలని కోరారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోవాల్సి వస్తోందని ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో గ్రామాలవారీగా రైతులను సమీకరించి అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతామని హెచ్చరించారు. పంటలు పూర్తిగా ఎండిపోకముందే ప్రభుత్వం స్పందించి సాగుకు సరిపడా విద్యుత్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్థులు రమేష్, ప్రసాద్, నగేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు