prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 2:02 pm Digital Edition : PRAJA VANI

కమలాపురంలో ఉచిత పశువైద్య శిబిరం

కమలాపురంలో ఉచిత పశువైద్య శిబిరం

సకాలంలో ఎద గుర్తింపుతో మేలుజాతి దూడల ఉత్పత్తి సాధ్యం

ముదిగొండ అక్టోబర్ 7 ప్రజావాణి
ముదిగొండ మండలంలోని కమలాపురం గ్రామంలో పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరం విజయవంతంగా పూర్తయింది. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పందిరి అంజయ్య, ఉపసర్పంచ్ మరికంటి లాలయ్య ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.
ఈ శిబిరంలో పశువులకు ఎదురయ్యే వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా గర్భకోశ వ్యాధుల చికిత్సలు, చూడి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు నట్టల నివారణ మందులను వేశారు.
ఈ సందర్భంగా వనంవారి కిష్ఠాపురం పశువైద్యులు డాక్టర్ యం. రమేష్ బాబు మాట్లాడుతూ… రైతులు తమ పాడి గేదెలను సకాలంలో ఎద గుర్తించి, సరైన సమయంలో ఎద సూదులు వేయించాలని సూచించారు. దీనివల్ల మేలుజాతి దూడల ఉత్పత్తి పెరిగి, రైతులకు ఆర్థికంగా మంచి లాభాలు చేకూరుతాయని తెలిపారు. అలాగే పశువులకు సంవత్సరం పొడవునా పోషకాహారం లభించేలా బహువార్షిక పశు గ్రాసాల (పచ్చిగడ్డి) పెంపకంపై రైతులు దృష్టి సారించాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ యం .వెంకటేశ్వర్లు, పశువైద్య సిబ్బంది అనిత, త్రివేణి, రోహిత్, ఇమ్రాన్ ఖాన్, గోపాలమిత్రులు ఎస్.కె రామపాషా, అరుణ, నరేష్, సైదులు, వీరనారాయణలతో పాటు గ్రామ పెద్దలు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.