జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 05 (ప్రజావాణి) : జిల్లా లోని దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో అసలు ఇళ్లు లేని, ఒక్క గుంట కూడా వ్యవసాయ భూమి లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కడవెండి గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు సోమవారం ఒక ప్రకటన లో ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల జనగామ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డబుల్ బెడ్రూం ఇళ్ల లక్కీ డ్రా లిస్టులో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే సొంత ఇళ్లు, ఒక ఇంట్లో రెండు, మూడు పేర్లు, ఎకరాల కొద్దీ భూములు ఉన్న వారికే లక్కీ డ్రా లో మళ్లీ ఇళ్లు వచ్చాయని, దీంతో అసలు ఇల్లు లేని నిజమైన నిరుపేద లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో రేకుల షెడ్లలో, గుడిసెల్లో నివసిస్తూ కూలీనాలి చేసుకుని బతికే పేద కుటుంబాలను అధికారులు పట్టించుకోలేదని, ఇండ్లు ఉన్నవారికే మళ్లీ లబ్ధి చేకూరడం సరైన పద్ధతి కాదని అన్నారు.
కాబట్టి ఈ లక్కీ డ్రా లిస్టుపై పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయి విచారణ జరపాలని, గ్రామానికి వచ్చి ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి భూమి ఉంది, ఎవరు నిజమైన పేదలు అనేది గుర్తించిన తరువాతనే పర్మినెంట్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని స్థానిక దేవరుప్పుల తహసీల్దార్ జనగామ జిల్లా కలెక్టర్ లను సర్పంచ్ భాషిపాక రాములు కోరారు.
నిజమైన పేదలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.