prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 4:58 pm Digital Edition : PRAJA VANI

కడవెండిలో భక్తిశ్రద్ధలతో చండీ హోమం – నవరాత్రి వేడుకలతో ఆధ్యాత్మిక శోభ

కడవెండిలో భక్తిశ్రద్ధలతో చండీ హోమం – నవరాత్రి వేడుకలతో ఆధ్యాత్మిక శోభ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 15(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం చండీ హోమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.

గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ఉదయం నుండి వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. హోమగుండం నుండి వచ్చే పవిత్ర జ్వాలలు, మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఈ సందర్భంగా భక్తులు సంప్రదాయబద్ధంగా హోమంలో పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడిపంటలు సమృద్ధిగా కలగాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ చండీ హోమ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. హోమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.