కందుకూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కష్టపడిన శ్రేణులకే పట్టం కట్టాలని టీడీపీ కార్యకర్తలు సానుభూతిపరుల డిమాండ్.
ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో
అక్టోబర్ 14.
కందుకూరు మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పార్టీ అత్యున్నత స్థాయి నాయకత్వం దృష్టికి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల నుంచి ఒక స్పష్టమైన డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడి, ఆది నుంచి చెమటోడ్చి జెండా మోసిన నిజమైన కార్యకర్తకే చైర్మన్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని వారు బలంగా కోరుకుంటున్నారు.
ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి లేదా కొత్తగా పార్టీలోకి వలస వచ్చిన అభ్యర్థులకు చైర్మన్ పదవి రేసులో ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని టీడీపీ శ్రేణులు, సానుభూతిపరులు తేల్చిచెప్తున్నారు. ఎన్నికల వేళ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కేడర్ ఆకాంక్షలను విస్మరిస్తే క్షేత్రస్థాయిలో నైతికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
పార్టీ సిద్ధాంతాలను నమ్మి, దశాబ్దాలుగా నష్టాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన సైనికుడిని గుర్తించాలని టీడీపీ అధిష్టానం చైర్మన్ అభ్యర్థి ఎంపికలో పునరాలోచించి సముచిత నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ శ్రేణులు, సానుభూతిపరుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనేది ఇప్పుడు కందుకూరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.