ఓట్ చోరీకి వ్యతిరేకంగా జనగామలో కాంగ్రెస్ ఆందోళన
భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే” నిరసన కార్యక్రమం
జనగామజిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 08(ప్రజావాణి): ఏఐసీసీ పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే” నిరసన కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వం “ఓట్ చోరీ” కి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇండియా కూటమి ఎంపీలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోడీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బీజేపీనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఓట్ల చోరీపై ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నేతలపై దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఓటర్ల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ మాట్లాడుతూ, జనగామ జిల్లాలోనే 63 వేలకు పైగా ఓట్లకు నోటీసులు జారీ చేయడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ఓటర్లు జనగామ జిల్లాకు చెందిన వారు కాదా? ఎందుకు నోటీసులు ఇచ్చారో అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వాలన్నారు. అర్హులైన ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, డాక్టర్ రాజమౌళి, వేముల మల్లేష్, బడికే ఇందిరా, మాజిద్ అప్సర్, జాయ మల్లేష్, సీసాల ప్రదీప్, సుంకరి శ్రీనివాస్ రెడ్డి, అభి గౌడ్, వేమల్ల పద్మ, బానోతు భాస్కర్, జిల్లెల్ల సిద్ధారెడ్డి, నరేంద్ర పవర్, చింతకింది మల్లేష్, జాఫర్ షరీఫ్, భూట్రెడీ శ్రీలత రెడ్డి, ఎస్సీ సెల్, మీడియా సెల్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.