prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 7:29 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఏపీ ఎన్జీవో బద్వేల్ తాలూకా అధ్యక్షునిగా ఆర్. అమర్నాథరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక: బీజేపీ నాయకుల ఘన సన్మానం

బద్వేల్: అక్టోబర్ 1ప్రజావాణి కాశినాయన  ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బద్వేల్ తాలూకా నూతన కార్యవర్గ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.బద్వేల్ తాలూకా సంఘ నూతన అధ్యక్షునిగా కాశినాయన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్,గా విధులు నిర్వహిస్తున్న ఆర్.అమర్నాథరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో అమర్నాథరెడ్డి అభ్యర్థిత్వానికి ఉద్యోగులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలపడం విశేషం. ఆయన ఏకగ్రీవ ఎన్నిక పట్ల తాలూకా పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు,పలు ప్రజా సంఘాల నాయకుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.అమర్నాథరెడ్డి ఎన్నిక బద్వేల్ తాలూకా ఎన్జీవో సంఘానికి మరింత చేవ తెస్తుందని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

బీజేపీ నాయకుల ఘన సన్మానం – అభినందనల జల్లు:

ఆర్.అమర్నాథరెడ్డి ఏపీ ఎన్జీవో బద్వేల్ తాలూకా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో స్థానిక రాజకీయ,సామాజిక వర్గాల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఇందులో భాగంగా బద్వేల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ బుసిరెడ్డి మనోహర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ నాయకులు అమర్నాథరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎదురు భాస్కర్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు మునీంద్ర యాదవ్ తదితర ముఖ్య నాయకులు నూతన అధ్యక్షుడిని శాలువాతో ఘనంగా సత్కరించి,పూలమాలలు వేసి అభినందించారు.

ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేయాలి: బీజేపీ నేతలు

ఈ సన్మాన కార్యక్రమం సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.ఆర్. అమర్నాథరెడ్డి గత ఐదేళ్లుగా (2019 నుండి) ఎన్జీవో అసోసియేషన్‌లో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు.ఉద్యోగుల సమస్యల పట్ల ఆయనకు ఉన్న అవగాహన, నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ ఉద్యోగ వర్గాల హక్కుల కోసం చేసే పోరాటాలే ఆయనను ఈ రోజు ఏకగ్రీవంగా ఈ పదవిని వరించేలా చేశాయని పేర్కొన్నారు. నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అమర్నాథరెడ్డి నేతృత్వంలో బద్వేల్ తాలూకా ఎన్జీవో సంఘం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనకు, ఉద్యోగుల సంక్షేమానికి ఆయన నిరంతరం అండగా నిలవాలని, సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాలని నాయకులు ఆకాంక్షించారు.

బాధ్యతలను నమ్మకంతో పూర్తి చేస్తా: ఆర్. అమర్నాథరెడ్డి కృతజ్ఞతలు

తన ఏకగ్రీవ ఎన్నికకు పూర్తి స్థాయిలో సహకరించిన ఉద్యోగ బంధువులకు, తోటి ఎన్జీవో నాయకులకు, అలాగే తనను ప్రత్యేకంగా అభినందించి సన్మానించిన బద్వేల్ నియోజకవర్గ బీజేపీ నాయకులకు అమర్నాథరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను అత్యంత నమ్మకంతో, నిబద్ధతతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. బద్వేల్ తాలూకా పరిధిలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఏ చిన్న సమస్య వచ్చినా,ఏ అర్ధరాత్రి అయినా తాను సదా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకుంటూ,సంఘం బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని భరోసా ఇచ్చారు.ఈ అభినందన మరియు సన్మాన కార్యక్రమంలో పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు,వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపారు.