prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 4:19 pm Digital Edition : PRAJA VANI

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి లో వరి సాగుకు దూరంగా ఉండాలి

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి లో వరి సాగుకు దూరంగా ఉండాలి – మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ఎల్‌నినో ప్రభావం కారణంగా యాసంగి సీజన్‌లో వర్షపాతం తగ్గి, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ సూచించారు. మంగళవారం నాడు మండల పరిధిలోని తుమ్మలపల్లి మరియు కస్తాల గ్రామాలలో దిగుబడి తగ్గి నష్టం జరిగిన పలు పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. భూగర్భ జలాలు తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నీటి లభ్యత ఆధారంగానే పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా శనగ, జొన్న , పెసర, మొక్కజొన్న, మినుము, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. రైతులు తమ భూముల స్వభావం, నేలలో తేమ, అందుబాటులో ఉన్న నీటి వనరులు, స్థానిక వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు అనుకూలమైన పంట రకాలను ఎంపిక చేసుకోవాలని, అవసరమైన మేరకే ఎరువులు, పురుగుమందులు వినియోగించాలని సూచించారు. నీటి పొదుపు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలని కోరారు. యాసంగి సాగులో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడం, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను నివారించడం ప్రధాన లక్ష్యాలుగా రైతులు ముందుకు సాగాలని వ్యవసాయ అధికారి సూచించారు. పంటల ఎంపిక విషయంలో సందేహాలు ఉన్న రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు నాగార్జున, మహేష్, తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ బోయపల్లి రాజేష్, గ్రామాల రైతులు పాల్గొన్నారు.