prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 4:14 pm Digital Edition : PRAJA VANI

ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
రెండో పంట సాగు చేసి నష్టపోవద్దు.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి ప్రజావాణి | అక్టోబర్ 11
కూసుమంచి: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో జల వనరులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇప్పటికే సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు రెండో పంట సాగు చేసి ఇబ్బందులు పడవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆదివారం కూసుమంచి మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఐటీడీఏ నిధులు రూ.1.63 కోట్లతో మంగలితండా–దుబ్బతండా మధ్య నిర్మించనున్న బీటీ రహదారి పనులకు, జుజ్జులరావుపేటలో రూ.45 లక్షలతో చేపట్టనున్న ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంకు, పైపులైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. మంగలితండాలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. హటియాతండాలో ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీటీసీ బదావత్‌ వీరన్న తండ్రి బాషూ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.
విద్యుత్తు కొరత తీవ్రంగా ఉంది
గతంలో యూనిట్‌ విద్యుత్తు రూ.7 నుంచి రూ.8కు లభించేదని, ప్రస్తుతం యూనిట్‌కు రూ.15 చెల్లించేందుకు సిద్ధమైనా విద్యుత్తు లభించని పరిస్థితులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. భూగర్భ జలమట్టాలు పడిపోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు.
రెండో పంట సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు రెండో పంట సాగు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి కోరారు. ఇప్పటికే సాగులో ఉన్న తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, నీటి లభ్యతను అంచనా వేసుకోకుండా రెండో పంట సాగు చేసి నష్టపోవద్దని సూచించారు.
కేంద్రాన్ని కలిసి ప్రత్యేక ప్యాకేజీ కోరతాం
ఎల్‌నినో ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై కనిపిస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ బృందం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరించనున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని, జీ రామ్ జీ పథకం కింద గ్రామాల్లో అదనపు పనిదినాలు కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ హఫీజుద్దీన్‌, కాంగ్రెస్‌ నాయకులు, పలువురు సర్పంచులు పాల్గొన్నారు.