ఎల్నినో ప్రభావంపై ఉద్యాన పంటల పరిశీలన
మిరప రైతులు బిందు సేద్యంతో నీటిని ఆదా చేయాలి
కూసుమంచి ప్రజావాణి, అక్టోబర్ 17:
కూసుమంచి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి ఎం.వి. మధుసూదన్ శనివారం సందర్శించారు. మిరప, మునగ, బొప్పాయి, ఆయిల్పామ్ పంట క్షేత్రాలను పరిశీలించి, ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల సాగుపై పడే ప్రభావాన్ని అంచనా వేశారు.
ఈ సందర్భంగా మిరప రైతులు బిందు సేద్యం అందుబాటులో ఉంటే దాని ద్వారా పంటకు నీటి తడులు అందించాలని సూచించారు. దీనివల్ల నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిరప పంటలో చీడపీడలు, తెగుళ్లు అధికమయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, ముఖ్యంగా నల్ల తామర పురుగు ఉధృతిని నియంత్రించేందుకు తగిన నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.
అలాగే ఆయిల్పామ్ సాగులో ప్రతి మొక్కకు నాలుగు వైపులా సమానంగా తేమ అందేలా బిందు సేద్యం ద్వారా నీటిని అందించాలని తెలిపారు.
పంట అవసరాలకు అనుగుణంగా నిర్ణీత మోతాదులో ఎరువులు వినియోగించాలని సూచించారు.
ఈ క్షేత్ర పరిశీలనలో పాలేరు ఉద్యాన అధికారి పి. అపర్ణతో పాటు రైతులు శరత్, రాంగోపాల్, సాయికుమార్, రవి, రాజశేఖర్ రెడ్డి, రవీందర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.