prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 1:36 pm Digital Edition : PRAJA VANI

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి, దేవరుప్పుల నూతన ఎస్ఐలు

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి, దేవరుప్పుల నూతన ఎస్ఐలు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు శుక్రవారం పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

పాలకుర్తి మండల నూతన ఎస్ఐగా ఊర సృజన్ కుమార్, దేవరుప్పుల మండల నూతన ఎస్ఐగా చింత రాజు ఇటీవలే తమ బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నూతన ఎస్ఐలకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా గంజాయి, మాదకద్రవ్యాలు, అక్రమ ఇసుక రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, యువత పెడదోవ పట్టకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేస్తేనే నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం నెలకొంటుందని అన్నారు.

ఎమ్మెల్యే సూచనలకు నూతన ఎస్ఐలు సానుకూలంగా స్పందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడకుండా నిబద్ధతతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.