prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 7:36 pm Digital Edition : PRAJA VANI

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు

**ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు**

మహిళలను గౌరవించాలి: తెలంగాణ
*రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుండెమోని జయమ్మ మల్లేష్ ముదిరాజ్*

రంగారెడ్డి జిల్లా మంచాల అక్టోబర్ 8 (ప్రజావాణి): ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మంచాల మండలం మాజీ ఎంపీపీ గుండెమోని జయమ్మ మల్లేష్ ముదిరాజ్ అన్నారు.

మంచాల మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి బస్సులో ప్రయాణిస్తూ మహిళల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎలా ఉందమ్మా అని మహిళలను అడిగి తెలుసుకునే సమయంలో బిడ్డలాంటి ఓ అమ్మాయి చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారని చెప్పారు.

అయితే, కొంతమంది బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆ దృశ్యాన్ని వీడియో తీసి వక్రీకరించి సోషల్‌ మీడియాలో తప్పుగా ప్రచారం చేయడం సిగ్గుచేటని, ఇది సరైన పద్ధతి కాదని జయమ్మ అన్నారు. ఆడపిల్ల అంటే అమ్మతో సమానమని, హిందూ ధర్మంలో మహిళలను మహాలక్ష్మిగా పూజిస్తామని పేర్కొన్నారు. మీ కుటుంబాల్లో ఆడపిల్లలు లేరా? మీ ఆడపిల్లల చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా మాట్లాడితే మేము కూడా ఇలాగే ప్రచారం చేయాలా? అని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను మీడియా ద్వారా ప్రశ్నించారు.

ఏ నాయకుడైనా రాజకీయంగా విమర్శలు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఆమె సూచించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆడపిల్లలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడది అంటే మీకు ఆటబొమ్మలా కనిపిస్తుందా? అని ప్రశ్నించారు.