*ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై సోషల్ మీడియాలో*
*దుష్ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలి*
రంగారెడ్డి జిల్లా మంచాల అక్టోబర్ 7 (ప్రజావాణి)
మంచాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్మ నరేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి
మంచాల మండలంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మంచాల మండల అధ్యక్షుడు ఎడ్మ నరేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకుడు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మంచాల సీఐ మధుకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పార్టీ శ్రేణులు, మీడియా మిత్రులతో కలిసి బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఇంజాపూర్ వరకు బస్సులో ప్రయాణం చేశారని పేర్కొన్నారు.
బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక బిడ్డలాంటి మహిళతో ఎమ్మెల్యే చేయి కలిపి ముచ్చటిస్తున్న సందర్భాన్ని కొందరు వ్యక్తులు వీడియో తీశారని, దానిని కావాలనే వక్రీకరించి ఎమ్మెల్యే మహిళ చేయి పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే కొంతమంది బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కావాలని సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.
ఇప్పటికైనా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంచాల పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బైరక రమాకాంత్ రెడ్డి, చీమల జంగయ్య యాదవ్, ఆరుట్ల మాజీ సర్పంచ్ ఆనంగళ్ల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పుల వినయ్, పాలకుర్ల శేఖర్ గౌడ్, నేనావత్ రాజు నాయక్, సర్పంచ్‌లు నేనావత్ బాలునాయక్, చంటి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రఘు, పగడాల శ్రీశైలం, రాజ్‌కుమార్ నాయక్, నూకం శేఖర్ ముదిరాజ్, లాలూ నాయక్‌తో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.