ఎన్.జి. కళాశాలలో రెండు ఎక్స్‌టెన్షన్ లెక్చర్ కార్యక్రమాలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎ), నల్గొండ లోని గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం రెండు ఎక్స్‌టెన్షన్ లెక్చర్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. రెండవ సంవత్సరం మరియు తృతీయ సంవత్సరం విద్యార్థుల విద్యా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, పోటీ పరీక్షలకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. రెండవ సంవత్సరం విద్యార్థులకు “Partial Differentiation” (పాక్షిక అవకలనాలు) అనే అంశంపై వి. శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్, రంగారెడ్డి జిల్లా, రిసోర్స్ పర్సన్ గా పాల్గొని విద్యార్థులకు అంశాన్ని సమగ్రంగా వివరించారు. అదేవిధంగా తృతీయ సంవత్సరం విద్యార్థులకు “Linear Algebra” (రేఖీయ బీజగణితం) అనే అంశంపై జి. నరేందర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా, రిసోర్స్ పర్సన్‌గా పాల్గొని వివిధ అంశాలను లోతుగా బోధించారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమాల్లో రిసోర్స్ పర్సన్లు సంబంధిత అంశాలను సులభంగా, విపులంగా వివరించడంతో పాటు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ముఖ్యంగా IIT-JAM, సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు ఏ విధంగా సిద్ధం కావాలి, ఏ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రశ్నలను ఏ విధంగా సాధన చేయాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమాల ద్వారా తమకు సబ్జెక్టుపై మరింత లోతైన అవగాహన ఏర్పడటంతో పాటు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే అనేక విషయాలను తెలుసుకున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, ఇటువంటి ఎక్స్‌టెన్షన్ లెక్చర్ల ద్వారా విద్యార్థులకు సబ్జెక్టుపై ప్రాక్టికల్ అవగాహనతో పాటు, ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు అవసరమైన మార్గదర్శకత్వం లభిస్తుందని తెలిపారు.
విద్యార్థులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో గణితశాస్త్ర విభాగాధిపతి వెంకట్రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ డి. మధుకర్, కె. కనకయ్య, మతిన్ హుస్సేన్, శోభ, బాల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.