prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 12:17 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ.. ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలిపిన కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్

ఘట్‌కేసర్, అక్టోబర్ 10 (ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఆడపడుచుల జీవితాల్లో ఆనందాన్ని నింపే పూల పండుగ అని ఘట్‌కేసర్ మాజీ వార్డు కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ పేర్కొన్నారు. ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో బతుకమ్మ పండుగ సందడి నెలకొన్న నేపథ్యంలో మహిళలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

పల్లెలకు, పట్టణాలకు కొత్త అందాలను తీసుకొచ్చే బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయమని అన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సంబరాలు జరుపుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించే బతుకమ్మ వేడుకలు మహిళల ఐక్యతకు, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు.

బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలను నింపాలని, ఆడపడుచులందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే ఈ పూల పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ కోరారు.