prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 4:36 pm Digital Edition : PRAJA VANI

ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా చేయాలి

ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా చేయాలి

ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి)::జనగామ జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న 57 మంది సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఉపాధిని పరిరక్షించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ జనరల్ మేనేజర్ సాయి అరుణ్ కుమార్ కు ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

జనగామ జిల్లా అదనపు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బఫర్ గోదాముల నుంచి నేరుగా రేషన్ షాపులకు బియ్యం తరలింపు చేపట్టడంతో ఎంఎల్ఎస్ పాయింట్లలోని కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 13వ తేదీన ఈ విషయాన్ని రాష్ట్ర కార్యాలయంలో జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని సర్క్యులర్ జారీ చేసినప్పటికీ జిల్లా అధికారుల తీరు మారలేదని తెలిపారు.

దీంతో మరోసారి సీఐటీయూ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పౌర సరఫరాల శాఖ రాష్ట్ర జనరల్ మేనేజర్ ను కలిసి సమస్యను వివరించారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, కొడకండ్ల ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న 57 మంది కార్మికులు మూడు దశాబ్దాలుగా ఈ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారి కుటుంబాలకు నష్టం జరగకుండా చూడాలని కోరారు.
వినతిపై స్పందించిన జనరల్ మేనేజర్ సాయి అరుణ్ కుమార్ ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా కొనసాగిస్తామని, జనగామ జిల్లాలో జారీ చేసిన సంబంధిత ఉత్తర్వులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని జనగామ జిల్లా మేనేజర్ కు తెలియజేసి ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే రేషన్ షాపులకు బియ్యం పంపించాలని సూచించినట్లు తెలిపారు.

మూడు దశాబ్దాలుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో సేవలందిస్తున్న హమాలీ కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించి జీవన భద్రత కల్పించాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జనగామ జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా ప్రతినిధులు బోరెల్లి సోమయ్య, పిట్టల తిరుపతి, జూకంటి పర్వతాలు, ఎదునూరి బిక్షపతి, రాపోలు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.