బద్వేల్ అక్టోబర్ 3 ప్రజావాణి మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కడప జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎర్రబల్లి ఓబయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సామాజిక ఉద్యమాల పితామహుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కడప నగరంలోని యుటిఎఫ్ భవనంలో ఎంఈఎఫ్ కడప జిల్లా సదస్సు శుక్రవారం (02 అక్టోబర్ 2026) అత్యంత వైభవంగా జరిగింది. ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిచ్చికె బాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా నలుమూలల నుంచి మాదిగ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.రాజ్యాధికార సాధనలో మాదిగ ఉద్యోగులదే కీలక పాత్ర: జాతీయ అధ్యక్షులు బిక్షాలు మాదిగ ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షులు బిక్షాలు మాదిగ మాట్లాడుతూ,సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సు కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మందకృష్ణ మాదిగ నిరంతరం ఉద్యమాలు చేస్తున్నారని కొనియాడారు.ఆయన ఆశయాలకు అనుగుణంగా, మాదిగ సమాజం రాజ్యాధికారాన్ని సాధించడంలో ఉద్యోగ వర్గాలు అత్యంత కీలకమైన భూమిక పోషించాలని పిలుపునిచ్చారు.చదువుకున్న సమాజం ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచినప్పుడే ఆశించిన మార్పు సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం: రాష్ట్ర అధ్యక్షులు బండారు శంకర్
ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బండారు శంకర్ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ సమర్థవంతమైన నాయకత్వంలో ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం,వారి సమస్యల పరిష్కారం కోసం ఫెడరేషన్ నిరంతరం పోరాడుతుందని హామీ ఇచ్చారు.ఉద్యోగులంతా ఒకే తాటిపైకి వచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఏపీ జెన్కో ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కే. సాల్మన్ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ వంటి గొప్ప దార్శనికత కలిగిన నాయకుడు ఏ ఇతర కులాల్లోనూ లేరని, ఆయన నాయకత్వంలో పనిచేసే భాగ్యం కలగడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ సదస్సులో ఎంఈఎఫ్ జాతీయ నాయకులు ఈరి జోనస్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎ. హనుమంతరావు, జాతీయ కోర్ కమిటీ సభ్యులు సిరంగి దేవానందం, ఓబులాపురం శోభన్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి ఐజయ్య, రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రెటరీ దేవరపల్లి విక్టర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మన్నేపాకుల రమేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. దళిత,మాదిగ ఉద్యోగుల హక్కుల కోసం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణను వారు వివరించారు.
నూతన కమిటీ ఎన్నిక.. కడప జిల్లా అధ్యక్షుడిగా ఎర్రబల్లి ఓబయ్య
సదస్సు ద్వితీయ భాగంలో కడప జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.జిల్లా అధ్యక్షుడిగా ఎర్రబల్లి ఓబయ్యతో పాటు మరో 40 మందిని నూతన కార్యవర్గ సభ్యులుగా సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఎర్రబల్లి ఓబయ్య మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మందకృష్ణ మాదిగకు,జాతీయ,రాష్ట్ర కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలో మాదిగ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి ఐక్యతకు అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కడప జిల్లా సదస్సు విజయవంతం కావడానికి బద్వేలు,మైదుకూరు,ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం,పులివెందుల,రాజంపేట తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మాదిగ ఉద్యోగులు,మేధావులు,అభిమానులు కీలక పాత్ర పోషించారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.