ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌పై ఆంక్షలు తొలగించాలి
జాయింట్ చెక్ పవర్‌ను యథావిధిగా కొనసాగించాలి: మందాటి రాము యాదవ్
మన ప్రజావాణి/ఎల్లారెడ్డిపేట
ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌పై విధిస్తున్న ఆంక్షలను తక్షణమే తొలగించాలని ఎల్లారెడ్డిపేట మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మందాటి రాము యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపసర్పంచ్‌లకు ఉన్న హక్కులను పరిరక్షిస్తూ జాయింట్ చెక్ పవర్‌ను యథావిధిగా కొనసాగించాలని కోరారు.
ఈ సందర్భంగా రాము యాదవ్ మాట్లాడుతూ.. ఉపసర్పంచ్‌లు బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులని తెలిపారు. గ్రామ పంచాయతీల పాలనలో ఉపసర్పంచ్‌లకు తగిన ప్రాధాన్యం, గౌరవం కల్పించడంతో పాటు గౌరవ వేతనం అందించాలని కోరారు.
గ్రామ పంచాయతీలకు మంజూరయ్యే నిధులు సక్రమంగా వినియోగం కావాలంటే ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కొనసాగించడం అవసరమని పేర్కొన్నారు. అలాగే మండల సర్వసభ్య సమావేశాలకు ఉపసర్పంచ్‌లను ఆహ్వానించి, గ్రామీణ పాలనకు సంబంధించిన అంశాలపై వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉపసర్పంచ్‌ల హక్కుల సాధన కోసం రాష్ట్రంలోని ఉపసర్పంచ్‌లందరినీ ఐక్యం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాము యాదవ్ స్పష్టం చేశారు.