prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 3:26 pm Digital Edition : PRAJA VANI

ఇసుక బకాసురులకు అండగా అధికారులా

ఇసుక బకాసురులకు అండగా అధికారులా?

విచ్చలవిడిగా ఇసుక దందా.. అడ్డుకట్ట వేయాలి: సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్

భూపాలపల్లి జిల్లా మన ప్రజావాణి : టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లోని చలివాగు పరివాహక గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోందని సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో చలివాగుల్లో నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు వర్షాలు లేకపోవడంతో చలివాగులను నమ్ముకుని వరి పంటలు సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మల్లేష్ తెలిపారు. చలివాగుల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి, భవిష్యత్‌లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇసుక తరలిస్తున్న వాహనాలకు ఇన్సూరెన్స్, ఇతర అవసరమైన పత్రాలు ఉన్నాయా? డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక రవాణా సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.
అలాగే, గ్రామపంచాయతీల పరిధిలో ఇసుక తరలించే వాహనాల నుంచి ట్రిప్పుకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని మల్లేష్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
చలివాగుల్లో ఇసుక తవ్వకాల వల్ల రైతులకు, భూగర్భ జలాలకు నష్టం కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులను మల్లేష్ డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.