prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 7:03 pm Digital Edition : PRAJA VANI

ఇందిరమ్మ మహిళా డెయిరీ లబ్ధిదారులకు పశువుల షెడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

ఇందిరమ్మ మహిళా డెయిరీ లబ్ధిదారులకు పశువుల షెడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి …!

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఇందిరమ్మ మహిళా డెయిరీ పథకం క్రింద పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు, పశువుల షెడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ మహిళా డెయిరీ పథకానికి సంబంధించి పశువుల షెడ్ల నిర్మాణం, పాడి పశువుల కొనుగోలు, పశుగ్రాసం సాగు, మహిళలకు నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ పారస్ కుమార్ లతో కలిసి, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో పాడి పశువుల కొనుగోలుకు ప్రస్తుత విడతలో మరో 250 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. వీరికి సంబంధించి ప్రత్యేక నాన్‌ ఆపరేటివ్ బ్యాంకు ఖాతాలను తెరవాలని అధికారులకు సూచించారు.
250 మంది లబ్ధిదారులకు విబి-జి రామ్ జి పథకం క్రింద పశువుల షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
మధిర నియోజకవర్గంలో మొత్తం 3,106 పశువుల షెడ్లు మంజూరు కాగా, 354 షెడ్ల నిర్మాణ మంజూరు పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం వీబీ రామ్ జీ పథకం క్రింద 171 పశువుల షెడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే 147 షెడ్ల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు.
పెండింగ్‌లో ఉన్న షెడ్ల నిర్మాణ పనులను సమీక్షిస్తూ, నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పశువుల షెడ్ల నిర్మాణానికి రూ.85 వేల సబ్సిడీతో పాటు, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు అదనంగా రూ.70 వేల సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశా లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
పాడి పశువులకు ఏడాది పొడవునా అవసరమైన పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రతి క్లస్టర్ పరిధిలో పశుగ్రాసం అవసరాలను ముందుగానే అంచనా వేయాలని కలెక్టర్ సూచించారు. పశుగ్రాసం సాగుకు అనువైన భూములను గుర్తించి, అవసరమైన సాగు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.

గరిష్ఠంగా 200 ఎకరాల వరకు పశుగ్రాసం సాగు చేయగల మహిళా స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేయాలని తెలిపారు. ప్రతి 1,000 పశువులకు మూడు మహిళా స్వయం సహాయక సంఘాలను అనుసంధానించి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేయాలని సూచించారు. పశువులకు అవసరమైన మేత నిరంతరంగా అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.
ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మధిర నియోజకవర్గంలో 10 వేల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ అందించేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
నైపుణ్య శిక్షణకు పూర్తి వ్యయ అంచనాతో పాటు, శిక్షణ కేంద్రాల షెడ్ల నిర్మాణానికి వ్యయ అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. శిక్షణ కోసం అవసరమైన మౌళిక సదుపాయాలు, యంత్రాలు, నిధుల అంచనాలను సమగ్రంగా సిద్ధం చేయాలని సూచించారు.
మహిళలకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు, పాడి పశువుల పెంపకం ద్వారా ఆదాయం పొందేలా ఇందిరమ్మ మహిళా డెయిరీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్డీవో శ్రీరామ్, జిల్లా పశు సంవర్థక అధికారి పురందర్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఫిరంగి, సంక్షేమ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.