prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 7:22 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదు.. అర్హతే ప్రామాణికం……అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష చూపం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఘట్‌కేసర్, అక్టోబర్ 14 (ప్రజా వాణి) ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేదని, అర్హతే ప్రామాణికంగా ఇళ్లను కేటాయిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి వివక్ష చూపడం లేదని పేర్కొన్నారు.

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పోచారంలో బుధవారం ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

హైదరాబాద్‌లో భూముల విలువ ఎకరాకు వందల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ, నగరంలోనే ఉపాధి పొందుతున్న పేదలను దూర ప్రాంతాలకు తరలించకుండా వారు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ టవర్స్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. తద్వారా పేదల ఉపాధికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మొదటి విడతలో లక్ష ఇళ్ల నిర్మాణం

క్యూర్‌ పరిధిలో మొదటి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, 23 నియోజకవర్గాల్లో నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఆరు ప్రాంతాల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో తొలి విడతగా 480 మంది లబ్ధిదారులను పారదర్శకమైన బహిరంగ డ్రా ద్వారా ఎంపిక చేశామన్నారు.

ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఇప్పటికే సొంత ఇళ్లు ఉన్నవారిని గుర్తించి, అర్హతలను నిర్ధారించిన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వివరించారు. ఎంపికైన వారిలో స్థానికంగా నివసించే అర్హులకే ఇళ్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల మంజూరు

రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 2.20 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ టవర్స్‌ కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.

ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపికైన లబ్ధిదారులకు కేవలం కేటాయింపు పత్రాలు ఇచ్చి సరిపెట్టబోమని, ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు లేకుండా పూర్తి హక్కులతో ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేసి అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన భూమిలో వాటాను కూడా రిజిస్ట్రేషన్‌లో పొందుపరుస్తామని పేర్కొన్నారు.

వచ్చే బతుకమ్మ పండుగ నాటికి తొలి విడత లబ్ధిదారులకు ఇళ్లను పూర్తి చేసి, వారి చేతుల మీదుగా తాళాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మొదటి విడతలో అవకాశం లభించని అర్హులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, తదుపరి విడతల్లో కొత్త దరఖాస్తుదారులతో పాటు అర్హులందరి దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు మౌలిక సదుపాయాలు

 

గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి తెలిపారు. ఆయా కాలనీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి సమీప ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు నిబంధనల ప్రకారం కేటాయించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఇప్పటికే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.440 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు.

అనంతరం మంత్రులు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ ఛైర్మన్‌ నర్సింహులు యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, హౌసింగ్‌ శాఖ ఎండీ వి.పి.గౌతమ్‌, కలెక్టర్‌ మను చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు స్నేహ, శివకుమారి, రెహ్మతి తదితరులు మాట్లాడి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని, ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. అనంతరం ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు కార్యక్రమం నిర్వహించారు.