ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్, అన్నోజిగూడ ఆర్జీకే కాలనీలో ఆదర్శ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ కమిటీ చైర్మన్ బోధస్ సురేష్, నాగరాజు గౌడ్, శివ తదితరులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
యువత సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మన సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. ఆదర్శ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను అందంగా నిర్వహించడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేశారు.