*ఆరోగ్యశ్రీ జాబితాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను పీఎం రాహత్ పథకంలో నమోదు చేయాలి…. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*
*వచ్చే సోమవారం నాటికి అన్ని ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి*
*రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్య సేవలు అందించాలి*
*ప్రమాద ప్రాంతాలు, ఆసుపత్రులను జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేయాలి*
*ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు*
*పీఎం రాహత్ పథకంపై సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలి*
*రోడ్ సేఫ్టీ కమిటి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్*
*మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి అక్టోబర్- 29*:
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సత్వర వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకం క్రింద జిల్లాలోని ఆరోగ్యశ్రీ జాబితాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తప్పని సరిగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం రాహత్ పథకం నోడల్ అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పథకం లక్ష్యాలు, అమలు విధానం, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వివరించారు.
*జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఎంప్యానెల్ అయిన 60 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను పీఎం రాహత్ పథకంలో నమోదు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం కలెక్టరేట్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ప్రతి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాల వివరాలను ఆసుపత్రులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు.
వచ్చే శనివారం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు) అవసరమైన పత్రాలతో ఖమ్మం కలెక్టరేట్‌కు హాజరై పీఎం రాహత్ పథకంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు కలెక్టరేట్లో 10 కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదివారం అవసరమైన పరీక్షలు నిర్వహించి, వచ్చే సోమవారం నాటికి ప్రతి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఎంప్యానెల్ అయిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు సమాచారం అందించి, పీఎం రాహత్ పథకంలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
*రోడ్డు ప్రమాద బాధితులకు 7 రోజుల వరకు 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స:*
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 112 అత్యవసర సేవలకు ఫోన్ చేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. పీఎం రాహత్ పథకం ప్రయోజనాలు, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రమాద ప్రాంతాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులను జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఆసుపత్రి వివరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని 108 అంబులెన్సులకు ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అంబులెన్సుల కదలికలు, బాధితులను ఆసుపత్రులకు తరలించే విధానాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని తగిన వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి బాధితులను త్వరగా తరలించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పీఎం రాహత్ పథకం ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాద బాధితులకు డబ్బు లేక చికిత్స ఆలస్యం కాకుండా, 7 రోజుల వరకు 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడటమేనని, ఈ లక్ష్యం నెరవేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
*ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు*
ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారిపై అధిక వేగం కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య అధికంగా ఉండటానికి గల కారణాలను సమగ్రంగా విశ్లేషించి, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు.
అధిక వేగాన్ని నియంత్రించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని,ప్రమాదాల నివారణకు అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించా లని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పీఎం రాహత్ పథకం పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఏసిపి శ్రీనివాసులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.