*ఆరుట్ల కూరగాయల మార్కెట్‌లో రైతులతో సమావేశం*
*రైతులందరూ మార్కెట్‌లోనే కూరగాయలు విక్రయించాలి*
*రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాం: మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి*
మంచాల, అక్టోబర్ 29( ప్రజావాణి):
మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి సందర్శించి, కూరగాయలు విక్రయించే రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చెరుకు నరసింహ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెదిరె హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరుట్ల గ్రామంలో రైతుల సౌకర్యార్థం అన్ని వసతులతో కూరగాయల మార్కెట్ నిర్మించి చాలా రోజులవుతున్నప్పటికీ, రైతులు ఇంకా రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారని తెలిపారు. రోడ్లపై కూరగాయలు అమ్ముతూ ఎండకు, వానకు రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో రైతుల కోసం అన్ని సౌకర్యాలతో మార్కెట్‌ను నిర్మించినట్లు పేర్కొన్నారు.
మార్కెట్‌లో అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ రైతులు అక్కడ కూరగాయలు విక్రయించేందుకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆరుట్ల కూరగాయల మార్కెట్‌లో ఇంకా ఏవైనా సౌకర్యాలు అవసరమైతే వాటిని కల్పించేందుకు మంచాల వ్యవసాయ సహకార సంఘం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రైతులందరూ ప్రతిరోజూ కూరగాయల మార్కెట్‌లోనే తమ ఉత్పత్తులను విక్రయించాలని సూచించారు. అలా చేయడం వల్ల ఆరుట్లలో పెద్ద కూరగాయల మార్కెట్ అందుబాటులో ఉందనే విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలుస్తుంది అని తెలిపారు.