prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 6:40 pm Digital Edition : PRAJA VANI

ఆదర్శ కమ్యూనిస్టు వీరయ్య

ఆదర్శ కమ్యూనిస్టు వీరయ్య
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 8 ప్రజావాణి:
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ కొంపెల్లి వీరయ్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి. నాగయ్య అన్నారు. గురువారం కురవి మండలం తట్టుపల్లి గ్రామంలో సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో కొంపెల్లి వీరయ్య సంస్మరణ సభ నిర్వహించారు. నక్క సైదులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జి. నాగయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
1988 నుంచి తుదిశ్వాస వరకు తాను నమ్ముకున్న ఎర్రజెండా సిద్ధాంతానికి కట్టుబడి వీరయ్య పనిచేశారని కొనియాడారు. కూలీలు, రైతుల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. సంతానం లేకపోయినా పార్టీనే తన కుటుంబంగా భావించి, తన ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారని గుర్తుచేశారు.
పార్టీ ఉద్యమాల సందర్భంగా పలుమార్లు నిర్బంధానికి గురై జైలు జీవితం గడిపినా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి ప్రతి ఒక్కరికీ అండగా నిలిచిన మంచి మనసున్న నాయకుడిని పార్టీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎర్రజెండాకు అంకితం
సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీలు మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, సుమారు 40 సంవత్సరాలు తాను నమ్మిన ఎర్రజెండా పార్టీలోనే కొనసాగిన వీరయ్య నేటితరం నాయకులు, కార్యకర్తలకు ఆదర్శమన్నారు. యువతరం ఆయన స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
భూస్వామ్య శక్తుల నుంచి పార్టీని కాపాడేందుకు గ్రామస్థాయిలో అనేక పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు వీరయ్య అని అన్నారు.
నివాళులర్పించిన నాయకులు
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శెట్టి వెంకన్న, అల్వాల వీరయ్య, ఆకుల రాజు, మండల కార్యదర్శి పిట్టల వెంకన్న, నాయకులు కడియం సత్యం, సీనియర్ నాయకులు నక్క ఉప్పలయ్య, కొల్లూరు సత్యం, స్వాతంత్ర్య సమరయోధురాలు బొమ్మన సుశీల, మల్లయ్య, భిక్షం, వెంకన్న, వీరయ్య సతీమణి కొంపెల్లి ఉప్పలమ్మతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
సభ అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులు అమరవీరుల స్మరణలో విప్లవ గీతాలు ఆలపించారు.