ఆంజనేయ నగర్ అభివృద్ధికి అండగా ఉంటా!
కాలనీ సమస్యల పరిష్కారమే లక్ష్యం: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు
కూకట్‌పల్లి : అక్టోబర్ 29(ప్రజావాణి)
ఖైతలాపూర్ డివిజన్ పరిధిలోని ఆంజనేయ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తూ, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు స్పష్టం చేశారు.
ఆంజనేయ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు గురువారం ఆయన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కాలనీవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలతో సమావేశమై కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు కృతజ్ఞతలు
కాలనీలో భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన రాజేశ్వరరావుకు సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా, తన వంతు బాధ్యతగా కాలనీ అభివృద్ధికి సహకరిస్తానని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, కాలనీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
కాలనీవాసుల సమస్యలను పరిష్కరించడంలో ప్రజలు, సంక్షేమ సంఘాలు, సంబంధిత అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.