prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 10:26 am Digital Edition : PRAJA VANI

అరాచక శక్తులకు గుణపాఠం చెప్పండి

*అరాచక శక్తులకు గుణపాఠం చెప్పండి.. అభివృద్ధికి పట్టం కట్టండి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి*

*కూటమి విజయంతోనే గుంటూరు స్వర్ణయుగం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి*

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 గుంటూరు జిల్లా

గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో అరాచక శక్తి అయిన వైసీపీకి గుణపాఠం చెప్పి, అభివృద్ధికి పట్టం కట్టమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి విజయంతోనే గుంటూరు స్వర్ణయుగమని, గుంటూరు నగరంలో మరింత వేగవంతం కావాలంటే రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులను, మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం శ్రీనివాసరావుపేటలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కూటమి ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే గళ్ళా మాధవి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ. 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు చరమగీతం పాడుతూ నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సమన్వయంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేడు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తోందన్నారు. కేంద్రం నుంచి అందుతున్న అపూర్వ నిధులతో అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, జాతీయ రహదారుల పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. గత పాలకుల్లా పక్షపాతం చూపకుండా ప్రతి ప్రాంతానికి సమగ్ర అభివృద్ధిని అందిస్తున్నామని, గంజాయి, రేషన్ మాఫియాలపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. అమరావతికి అతి సమీపంలో ఉన్న గుంటూరు నగరానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, సింగపూర్ తరహాలో ప్లాస్టిక్ రహిత, స్వచ్ఛమైన స్మార్ట్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమన్నారు. ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలే కదా అని తేలిగ్గా తీసుకోకుండా, అధికారం అనర్హుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని 25 మంది టీడీపీ, 6 మంది జనసేన, 3 మంది బీజేపీ అభ్యర్థులతో పాటు మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణను సైకిల్, గాజుగ్లాసు, కమలం గుర్తులపై ఓట్లేసి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా 15,647 ఉద్యోగాల నియామకం, తల్లికి వందనం, ఒకటో తేదీనే రూ.4,000 పింఛన్ల పంపిణీ విజయవంతంగా చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు వందల సంఖ్యలో కోర్టుల్లో పిటిషన్లు వేసి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వారి ద్వారా ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేసినా ప్రజలు, ఎన్నికల సంఘం తిప్పికొట్టాయని మండిపడ్డారు.

జనసేన పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రానికి రూ.40,000 కోట్ల జల్ జీవన్ మిషన్ నిధులు వచ్చాయని, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమన్వయంతో నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, ఫ్లైఓవర్ల నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు. 10 లక్షల జనాభా దాటిన గుంటూరును మిలీనియం సిటీగా మార్చడానికి కూటమిని ఆదరించాలని కోరారు.

*జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…* ఎమ్మెల్యే గళ్ళా మాధవి క్షేత్రస్థాయి పనితీరు పట్ల ప్రజల్లో పూర్తి సంతృప్తి ఉందని, గత ప్రభుత్వ వేధింపులు లేని ప్రశాంత వాతావరణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా కూటమి వైపు నిలుస్తున్నారని, కార్పొరేషన్‌లో 100% స్ట్రైక్ రేట్ సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

*బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతి రావు మాట్లాడుతూ…* కేంద్ర మంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలో నగరానికి ఆరు ఫ్లైఓవర్లు మంజూరయ్యాయని, పశ్చిమ, తూర్పు, రూరల్ పరిధిలోని మొత్తం 76 డివిజన్లలో కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని, మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ గెలుపు ఏకపక్షంగా ఖాయమైందని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంతో పాటు గుంటూరు ప్రగతిని కాంక్షిస్తూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజారిటీ అందించాలని నేతలందరూ పిలుపునిచ్చారు.