prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 8:40 pm Digital Edition : PRAJA VANI

అమ్మవారికి మహా లింగార్చన.. భక్తిభావంతో పులకించిన భక్తులు

*అమ్మవారికి మహా లింగార్చన.. భక్తిభావంతో పులకించిన భక్తులు*

*రాయికల్; అక్టోబర్ 12(ప్రజావాణి)*

రాయికల్ పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని పురాతన పెద్ద పోచమ్మ దేవాలయం వద్ద సోమవారం భక్తి శ్రద్ధలు వెల్లివిరిసాయి.పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సంఘమిత్ర శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా లింగార్చన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ పుణ్యకార్యం కోసం ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ దేవస్థానం నుండి అర్చకుల బృందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు.వేములవాడ అర్చకులు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చన, మహా లింగార్చన నిర్వహించి భక్తులకు అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని ప్రార్థించారు. అర్చకుల గళం నుండి వెలువడిన దుర్గా స్తోత్రాలు, లలితా సహస్రనామాలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఉదయం నుండే పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు.పూజా కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర శివాజీ యూత్ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, భవాని మాల ధరించిన దీక్షాపరులు, పట్టణ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.