prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 9:38 pm Digital Edition : PRAJA VANI

అమెరికాలో WETA India ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు

అమెరికాలో WETA India ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు

వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకానున్న తెలంగాణ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 14(ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరా పండుగలను అమెరికా గడ్డపై ఘనంగా నిర్వహించేందుకు వుమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA India) సిద్ధమైంది.

కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ రామన్‌లోని విండెమెరె రాంచ్ మిడిల్ స్కూల్‌లో ఈ నెల అక్టోబర్ 17, 2026 శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరగనున్నాయి.

ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆమె ప్రవాస తెలుగు మహిళలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలకు, ముఖ్యంగా యువతరానికి మన బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేయడం, ప్రవాసంలో ఉన్న తెలుగు మహిళలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆత్మీయతను, ఐక్యతా భావాన్ని పెంపొందించడమే ఈ వేడుకల ప్రధాన లక్ష్యమని WETA India ఫౌండర్ అండ్ అడ్వైజర్ చైర్‌పర్సన్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు.

ఈ వేడుకల్లో బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళా సాధికారతపై చర్చలు, ప్రతిభావంతుల సత్కారం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో అమెరికాలో తెలంగాణ సంబురాన్ని తలపించనున్నారు.

అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారందరూ, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.