prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 6:59 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

అనురాగ్ యూనివర్సిటీలో హెచ్‌ఎంఏ స్టూడెంట్ చాప్టర్ ప్రారంభం

ఘాట్ కేసర్, సెప్టెంబర్ 30 (ప్రజా వాణి): అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బీబీఏ, ఎంబీఏ విద్యార్థుల కోసం హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎంఏ) స్టూడెంట్ చాప్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఎంఏ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.

ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి డా. వి. విష్ణు వందన మాట్లాడుతూ హెచ్‌ఎంఏ ప్రాధాన్యతతో పాటు విద్యార్థులు, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్ కోసం సంస్థ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. హెచ్‌ఎంఏ అధ్యక్షుడు శరత్ చంద్ర మారోజు మాట్లాడుతూ సంస్థాగత అభివృద్ధితో పాటు విద్యార్థులకు అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలను వివరించారు.

పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్, పరిశ్రమ అనుభవం, భవిష్యత్ కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. హెచ్‌ఎంఏ కార్యదర్శి రమేష్ లక్ష్మణన్ మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. తమ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందడంతో పాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా మంచి వారసత్వాన్ని నిర్మించుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమానికి హెచ్‌ఎంఏ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి. ప్రసన్న, కార్యక్రమ సమన్వయకర్తలు డా. సి. మల్లేశ్, జి. శ్రీవాణి తదితరులు హాజరయ్యారు.