prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 2:46 pm Digital Edition : PRAJA VANI

అనుమతి లేని ప్రాంతాలకు అక్రమ మద్యం రవాణా

అనుమతి లేని ప్రాంతాలకు అక్రమ మద్యం రవాణా.
​గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపుల దందా
​ఎంఆర్పీ కంటే రూ. 20 నుంచి రూ. 50 వరకు అధిక వసూళ్లు
​గ్రామ నడిబొడ్డున వైన్ షాపుల నిర్వహణ.. పట్టించుకోని అబ్కారీ శాఖ.

ఏటూరునాగారం అక్టోబరు 18 ప్రజావాణి:
​
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, మద్యం సిండికేట్లు అక్రమ దందాకు తెరలేపాయి. అమ్మకాలకు ఎటువంటి అనుమతులు లేని మండలాలకు సైతం ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా భారీగా మద్యం తరలిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. స్థానికులకు విక్రయించాల్సిన మద్యాన్ని అధిక ధరలకు బెల్టు షాపులకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.
​నిబంధనలకు విరుద్ధంగా రవాణా, విక్రయాలు:
నిబంధనల ప్రకారం నిర్దేశిత ప్రాంతంలో, కేటాయించిన దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయాలు జరగాలి. అయితే, కొన్ని వైన్ షాపుల నిర్వహకులు అధికారుల కళ్ళుగప్పి, అనుమతులు లేని సుదూర మండలాల్లోని గ్రామాలకు ఆటోల్లో రహస్యంగా మద్యాన్ని తరలిస్తున్నారు. స్థానిక ప్రజలకు విక్రయించకుండా, నేరుగా అక్రమ బెల్టు షాపుల నిర్వాహకులకు పెద్ద ఎత్తున సరుకును చేరవేస్తున్నట్లు సమాచారం.
​అధిక ధరల మోత.. ప్రతీ బాటిల్‌పై అదనపు వసూళ్లు:
ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర కంటే ప్రతి బాటిల్‌పై రూ. 20 నుంచి రూ. 50 వరకు అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారు. గ్రామ నడిబొడ్డున వైన్ షాపులను, బెల్టు షాపులను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నప్పటికీ, అడ్డుకోవాల్సిన అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
​కనీస పర్యవేక్షణ కరువు..

*మౌనం వహిస్తున్న అబ్కారీ శాఖ:*

మద్యం సిండికేట్ల ఆగడాలు మితిమీరుతున్నా, అబ్కారీ శాఖ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, అనుమతి లేని ప్రాంతాలకు మద్యం తరలిస్తున్న వారిపై, అధిక ధరలకు విక్రయిస్తున్న వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.