prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 7:29 pm Digital Edition : PRAJA VANI

అధికారిక కార్యకలాపాలలో తెలుగు భాష వినియోగాన్ని విస్తృతం చేయాలి

అధికారిక కార్యకలాపాలలో తెలుగు భాష వినియోగాన్ని విస్తృతం చేయాలి

* స.హ. చట్టం క్రింద నిర్ణీత గడువులో పారదర్శకంగా సమాచారం అందించాలి
* జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

ప్రభుత్వ కార్యాలయాలలో అధికారిక కార్యకలాపాలను వీలైనంత వరకు తెలుగులోనే నిర్వహిస్తూ, సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు, అధికారిక సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే భాషలో అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన అధికార భాష అమలు సమావేశం, సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మాట్లాడుతూ అధికారిక కార్యకలాపాలలో తెలుగు భాష వినియోగాన్ని పెంపొందించాలని తెలిపారు. మన భావాలను వ్యక్తపరచడానికి పుట్టినప్పటి నుంచి ఉపయోగించే మాతృభాష తెలుగు అని, ప్రతి రంగంలోనూ తెలుగు భాష వినియోగాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అనే గొప్పతనాన్ని గుర్తుచేస్తూ, మన భాషను కాపాడుకోవడం, భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, అధికారుల నామఫలకాలు, హోదాలు, హాజరు రిజిస్టర్లు, సెలవు దరఖాస్తులు, కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు,, సిబ్బందికి సంబంధించిన ఇతర అధికారిక పత్రాలలో వీలైనంత వరకు తెలుగు భాషను ఉపయోగించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించే కార్యక్రమాలు ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలని, క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు అధికారిక కార్యకలాపాలలో తెలుగు వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు అర్థమయ్యే భాషలో సమాచారాన్ని అందించడం ద్వారా తెలుగు భాష అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాట్లాడుతూ తెలుగు భాష వినియోగం క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ రోజువారీ విధుల నిర్వహణలో తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలలో తెలుగు భాషను విస్తృతంగా ఉపయోగించాలని, సమాచార హక్కు చట్టం క్రింద అందించే సమాధానాలను కూడా సాధ్యమైనంత వరకు తెలుగులో అందించాలని తెలిపారు సమాచార హక్కు చట్టం పారదర్శకంగా నిర్వహించాలి
సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులో సమాచారాన్ని అందిస్తూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించాలని తెలిపారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రజలకు సేవలందించడమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యతని, సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారాన్ని అందించడం అధికారుల విధి అని తెలిపారు. దరఖాస్తులో కోరిన సమాచారం తమ శాఖకుసంబంధించనప్పుడు, చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత శాఖకు దరఖాస్తును బదిలీ చేసి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారుజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి హృదయ స్పందన వంటిదని, చైతన్యవంతమైన ప్రజలతోనే ప్రజాస్వామ్యం మరింతబలోపేతమవుతుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పనితీరు, నిర్ణయాలు, అందుబాటులో ఉన్న సమాచారం గురించి తెలుసుకునే అవకాశాన్ని సమాచార హక్కు చట్టం కల్పిస్తుందని తెలిపారు. ఈ చట్టంపై అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండి, దరఖాస్తులను బాధ్యతాయుతంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు సమాచారాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందించాలని, సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తు అందిన 30 రోజులలోగా సంబంధిత సమాచారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుపై తీసుకున్న చర్యల గురించి దరఖాస్తుదారులకు తెలియజేయాలని, చట్టప్రకారం అందించదగిన సమాచారాన్ని నిర్ణీత గడువులో అందించాలని తెలిపారు. సమాచార హక్కు చట్టం క్రింద వచ్చే దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, చట్టబద్ధమైన విధానాలను పాటించాలని తెలిపారు. అనంతరం సమాచార హక్కు చట్టం, సెక్షన్లపై అధికారులకు అవగాహన కల్పించి, సమాచార హక్కు చట్టంపారదర్శకంగా ,జవాబుదారీతనంతో అమలు చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు అంతకుముందు జిల్లాలో బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల ప్రతినిధులతో కలిసి గోడప్రతులను ఆవిష్కరించారు
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్ పాండే, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..