అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్ల ప్రకటన రుసుముల ద్వారా రూ.87,000/- వసూలు చేసిన జనగామ మున్సిపాలిటీ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జనగామ పట్టణంలో అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్లపై జనగామ మున్సిపాలిటీ కొరడా ఝళిపించింది. పట్టణ పరిధిలో ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల నుండి నిబంధనల ప్రకారం ప్రకటన రుసుము (Advertisement Fee) వసూలు చేసింది.
ఇప్పటివరకు మొత్తం రూ.87,000/- వసూలు చేయడం జరిగిందని జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
“జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా మున్సిపాలిటీ అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రతి ఫ్లెక్సీకి జరిమానా విధించడంతో పాటు ప్రకటన రుసుము వసూలు చేస్తామన్నారు.
పట్టణ సుందరీకరణలో భాగంగా, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని, అనుమతి లేని ఫ్లెక్సీల వల్ల కరెంట్ స్తంభాలు, రోడ్ల పక్కన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని . అందుకే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రూ.87 వేలు వసూలు చేశామన్నారు.
ఇకపై ఫ్లెక్సీలు వేసే వ్యక్తులు, సంస్థలు, రాజకీయ నాయకులు, వ్యాపార సంస్థలు ముందుగా మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకుని, నిర్ణీత రుసుము చెల్లించి అనుమతి పొందాలి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని ఫ్లెక్సీలను వెంటనే తొలగిస్తాం” అని కమిషనర్ హెచ్చరించారు.

ఈ వసూళ్ల కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు అధికారులు పాల్గొన్నారని తెలిపారు.