prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 3:41 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అక్రమారల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పోరుమామిళ్ల ఎమ్మార్వో కర్నాటి విజయ్ కుమార్:

చెన్నారెడ్డిపేటలో ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపునకు ముంద అడుగు!

అధికారమంటే కుర్చీలో కూర్చోవడం కాదు.అక్రమాలను ఎదురించి నిలబడడం”అని నిరూపిస్తున్నారు ఎమ్మార్వో కర్నాటి విజయ్ కుమార్.

కడప జిల్లా పోరుమామిళ్ల అక్టోబర్ 8 ప్రజావాణి  మండలం,పుల్లివీడు పంచాయతీ పరిధిలోని చెన్నారెడ్డిపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన అక్రమ షెడ్డును తొలగించడానికి రెవెన్యూ అధికారులు గురువారం నాడు మెరుపు దాడి నిర్వహించారు.గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 21/6లో గల 40 సెంట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని శ్రీనివాసరెడ్డి సిద్ధుల అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకుని, అందులో ఒక పెద్ద షెడ్డును నిర్మించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోరుమామిళ్ల ఎమ్మార్వో కర్నాటి విజయ్ కుమార్,ఆర్ఐ సుధాకర్ రెడ్డి,వీఆర్వో ఓబయ్యలతో కలిసి అక్రమ కట్టడాలను తొలగించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.

అధికారులపై ఎదురుతిరిగిన స్థానికులు.వెనక్కి తగ్గని ఎమ్మార్వో:

అధికారులు అక్రమ షెడ్డును తొలగించే ప్రక్రియను ప్రారంభించగా, ఆక్రమణదారునికి మద్దతుగా కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకుని అడ్డు తగిలారు.”ఈ స్థలం మాది. మీరెవరు తొలగించడానికి?”అంటూ ఎమ్మార్వో మరియు రెవెన్యూ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తూ, వారి విధులకు ఆటంకం కలిగించేలా ఎదురుతిరిగారు. స్థానికులు ఎంతలా ఒత్తిడి తెచ్చినా,దురుసుగా ప్రవర్తించినా ఎమ్మార్వో విజయ్ కుమార్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, చట్టం ముందు ఎవరైనా ఒకటేనని గంభీరంగా నిలబడ్డారు.

పోలీసుల రంగప్రవేశం – రెండు రోజుల గడువు:

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చట్టపరమైన చర్యలకు సహకరించాలని పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు స్పష్టం చేయడంతో, ఆక్రమణదారులు దిగివచ్చారు. తామే స్వయంగా ఈ అక్రమ షెడ్డును తొలగించుకుంటామని, అందుకు రెండు రోజుల సమయం కావాలని పోలీసులకు, ఎమ్మార్వోకు హామీ ఇచ్చారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు – ఎమ్మార్వో హెచ్చరిక:

ఈ సందర్భంగా ఎమ్మార్వో కర్నాటి విజయ్ కుమార్ అక్రమార్కులకు ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ భూమి ఒక్క సెంట్ అయినా సరే, అది ప్రజల ఆస్తి అని, దాన్ని ఆక్రమించుకుని షెడ్లు గాని, రూములు గాని నిర్మిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ ఆస్తులను కాజేయాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఎమ్మార్వో అంటే ఇలా ఉండాలి!ప్రభుత్వ భూముల రక్షణలో రాజకీయ ఒత్తిళ్లకు, స్థానిక బెదిరింపులకు లొంగకుండా, సింహంలా నిలబడి విధులను నిర్వహించిన ఎమ్మార్వో విజయ్ కుమార్ శైలిపై మండల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. “అధికారి అంటే అక్రమార్కులకు సింహస్వప్నంలా ఉండాలి” అనేదానికి విజయ్ కుమార్ నిదర్శనంగా నిలిచారని, ఇలాంటి నిజాయితీ గల అధికారులు ఉంటే ప్రభుత్వ భూములకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రజలు కొనియాడుతున్నారు