అంబేద్కర్ పార్కులో సాహెబ్ కాన్షీరామ్‌కు ఘన నివాళులు
“ఒక్క ఓటు – ఒక్క నోటు” నినాదంతో బహుజన చైతన్యానికి కృషి చేసిన మహనీయుడు కాన్షీరామ్
కూకట్‌పల్లి, అక్టోబర్ 9 (ప్రజావాణి): దయార్‌గూడ అంబేద్కర్ పార్కులో సాహెబ్ కాన్షీరామ్ 20వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రమాబాయి అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ సింగూరు పూర్ణిమ పాండు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మహనీయులకు జ్ఞానమాలలు వేసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా జ్ఞానమాల కన్వీనర్ సింగూరు పాండు మాట్లాడుతూ, దేశంలో బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా “ఒక్క ఓటు – ఒక్క నోటు” నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన నాయకుడు మాన్యవర్ సాహెబ్ కాన్షీరామ్ అని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో బహుజనుల రాజకీయ చైతన్యం కోసం కాన్షీరామ్ విశేష కృషి చేశారని గుర్తుచేశారు.
బహుజనులంతా ఐక్యంగా ఉండి ఓటు విలువను గుర్తించాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాజకీయ అధికారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో యువ న్యాయవాది సింగూరు శిల్ప, దళితుల ఐక్యవేదిక నాయకుడు జీనుగు పుల్లారావు, కార్యనిర్వాహకులు మద్దెల గిరి, రాజేష్ పాశ్వాన్, పి. రాములు, అంబేద్కర్ సంఘం సభ్యులు బి. వినోద్ రావు, ఎం. మహేష్ బాబు, కొండల్ రావు తదితరులు పాల్గొని సాహెబ్ కాన్షీరామ్‌కు ఘన నివాళులర్పించారు.