prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 7:16 pm Digital Edition : PRAJA VANI

అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

*అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు*

*—-ఆటపాటలతో మార్మోగిన పండగ ఉత్సవాలు*

*రాయికల్; అక్టోబర్ 22(ప్రజావాణి)*

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి.తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పూజించిన ఆడపడుచులు, చివరి రోజైన గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా గ్రామంలోని బతుకమ్మ ఘాట్ వద్దకు భారీగా చేరుకున్నారు. గునుగు, తంగేడు, బంతి, చేమంతి, కట్ల పూలతో రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు.బతుకమ్మల చుట్టూ వలయంగా చేరి “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” అంటూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, లయబద్ధంగా అడుగులు వేస్తూ సందడి చేశారు. మహిళల కోలాటాలు, ఆటపాటలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో వీరాపూర్ గ్రామం పూల సోయగాలతో పండుగ శోభను సంతరించుకుంది.బతుకమ్మ నిమజ్జనానికి గ్రామ సర్పంచ్ డిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉప సర్పంచ్ దుంపల నర్సారెడ్డి, పాలక వర్గ సభ్యులు ఘనమైన ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఘాట్ల వద్ద లైటింగ్ ఏర్పాటుతో పాటు, మహిళలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యతను, ఆత్మీయతను పెంపొందిస్తుందని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఈ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని పలువురు పేర్కొన్నారు.