prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 9:50 am Digital Edition : RAJU NANGUNOOR

MRPS TS సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా దేవులపల్లి రాజేందర్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక జిల్లాలో మాదిగలకు అన్యాయం జరిగితే ముందుండి న్యాయపరంగా పోరాటం చేస్తా: రాజేందర్ మాదిగ

సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 10 (ప్రజావాణి):

MRPS TS సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా నంగునూరు గ్రామానికి చెందిన దేవులపల్లి రాజేందర్ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని MRPS రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ నాయకత్వంలో సిద్దిపేట జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా దేవులపల్లి రాజేందర్ మాదిగను, జిల్లా కార్యదర్శిగా లింగాల నరసింహులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రాజేందర్ మాదిగ మాట్లాడుతూ.. గతంలో తాను MRPS సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా, జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించానని తెలిపారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని వాటిని విజయవంతం చేసేందుకు కృషి చేశానన్నారు.తాను చేసిన సేవలను, కార్యక్రమాల్లో చూపిన చొరవను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన నాయకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.సిద్దిపేట జిల్లాలో మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరఫున ముందుండి పోరాడుతానని రాజేందర్ మాదిగ స్పష్టం చేశారు. మాదిగల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం అవసరమైన సందర్భాల్లో న్యాయపరమైన పోరాటాలకు సిద్ధంగా ఉంటానన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని జిల్లాలోని నాయకులు, కార్యకర్తల సహకారంతో విజయవంతం చేస్తానని తెలిపారు.తన ఎన్నికకు సహకరించిన MRPS జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్‌తో పాటు జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలకు దేవులపల్లి రాజేందర్ మాదిగ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన లింగాల నరసింహులుకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. నూతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో MRPSను మరింత బలోపేతం చేసి, మాదిగల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.