prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:11 pm Digital Edition : PRAJA VANI

980 గ్రాముల పసిబిడ్డకు పునర్జన్మ

*980 గ్రాముల పసిబిడ్డకు పునర్జన్మ*

• అరుదైన చికిత్సతో ప్రాణాలు కాపాడిన శిశురక్ష ఆసుపత్రి వైద్యులు
• వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి

మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 19సంగారెడ్డి:

నెలలు నిండకముందే కేవలం 980 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువుకు సంగారెడ్డిలోని శిశురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు అరుదైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోవడంతో శిశువుకు డయాలసిస్, వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.
శిశువు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆందోళన చెందిన తల్లిదండ్రులు జగ్గారెడ్డిని సంప్రదించారు. దీంతో ఆయన వెంటనే శిశువును సంగారెడ్డిలోని శిశురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో సుమారు 50 రోజులపాటు చికిత్స అందించడంతో శిశువు ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. ప్రస్తుతం శిశువు బరువు 1.6 కిలోలకు చేరింది.
ఆసుపత్రికి వెళ్లి వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి
శిశువు ఆరోగ్యం మెరుగుపడిన విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి స్వయంగా శిశురక్ష ఆసుపత్రికి వెళ్లి పసిబిడ్డను పరామర్శించారు. వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. సంగారెడ్డిలోనే అత్యాధునిక వైద్య సేవలు అందించి, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పసిబిడ్డ ప్రాణాలను కాపాడటం అభినందనీయమని పేర్కొన్నారు.
వైద్యులు శిశువును కంటికి రెప్పలా కాపాడి చికిత్స అందించడం వల్ల తల్లిదండ్రుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని జగ్గారెడ్డి తెలిపారు.
బిల్లులో సగం మినహాయింపు
సుమారు 50 రోజుల చికిత్సకు రూ.4 లక్షలకు పైగా బిల్లు అయినట్లు తెలిపారు. శిశువు తల్లిదండ్రులు సుమారు రూ.2 లక్షలు చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని తాను చెల్లిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం మానవతా దృక్పథంతో బిల్లులో సగం మొత్తాన్ని మినహాయించినట్లు వెల్లడించారు.