prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 9:02 pm Digital Edition : MAHESH MEDCHAL

*పోకిరిలకు అడ్డాగా ఎర్ర చెరువు కట్ట*

*పోకిరిలకు అడ్డాగా ఎర్ర చెరువు కట్ట*

*విద్యుత్ దీపాలు లేక అంధకారం.. గుబురు చెట్ల మధ్య అసాంఘిక కార్యకలాపాలు*

*పోలీసులు రోజూ పెట్రోలింగ్ నిర్వహించి మహిళలు, వాహనదారులకు భద్రత కల్పించాలని డిమాండ్*

మేడ్చల్, సెప్టెంబర్ 23: మేడ్చల్‌లోని ఎర్ర చెరువు కట్ట రోడ్డు రాత్రివేళల్లో అంధకారంలో ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట చుట్టూ గుబురుగా చెట్లు పెరగడంతో పాటు ఒక్క విద్యుత్ దీపం కూడా లేకపోవడంతో ఈ ప్రాంతం కొందరు ఆకతాయిలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో కొందరు యువకులు చెరువు కట్ట రోడ్డుపై సిగరెట్లు, మద్యం సేవిస్తున్నారని, కొందరు గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం ఆ మార్గంలో వాహనాలపై వెళ్లే వారిని దూషిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గుబురుగా పెరిగిన చెట్ల కారణంగా రోడ్డుపై ఏదైనా ఘటన జరిగినా బయటకు కనిపించే అవకాశం లేదని, దీంతో మహిళలు, యువతులు రాత్రివేళ ఈ మార్గంలో ప్రయాణించేందుకు భయపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే మహిళలకు భద్రతపై ఆందోళన నెలకొంది.పోలీసులు అప్పుడప్పుడు చెరువు కట్ట వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ కొందరి ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చెరువు కట్టపై రోజూ పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

అదేవిధంగా సంబంధిత అధికారులు గుబురుగా పెరిగిన చెట్లను తొలగించి, రహదారి పొడవునా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని మహిళలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆకతాయిలపై నిఘా పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మహిళలు, వాహనదారులకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.