prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 10:59 am Digital Edition : PRAJA VANI

23 డిమాండ్లు సాధించడం చారిత్రాత్మకం

*23 డిమాండ్లు సాధించడం చారిత్రాత్మకం*

*కార్మికులను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేయడం తగదు*

*దసరా పండుగ లోపే కార్మికులకు లాభాల్లో వాటా*

*ఎస్సిడబ్ల్యూయు (ఏఐటియుసి) రాష్ట్ర అధ్యక్షుడు, వేజ్ బోర్డు సభ్యుడు వాసీరెడ్డి సీతారామయ్య*

* *మన ప్రజావాణి* మందమర్రి:-

గత నెల 27న హైదరాబాద్‌ లో సింగరేణి కార్మికుల సమ్మె నోటీసులో ఉన్న డిమాండ్లపై రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సి) సమక్షంలో యాజమాన్యంతో జరిగిన చర్చల్లో 32 సమ్మె డిమాండ్లకు గాను 23 డిమాండ్లు సాధించడం చారిత్రాత్మక ఒప్పందమని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు, వేజ్ బోర్డు సభ్యుడు వాసీరెడ్డి సీతారామయ్య తెలిపారు. గురువారం ఏరియాలోని కేకే -5 గనిలో యూనియన్ బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ, ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పెర్క్స్ పై ఐటి రియంబర్స్మెంట్ సమస్య, కోల్ ఇండియాలో అమలు అవుతున్నా సింగరేణిలో అమలుకు నోచుకోలేదని, గత ప్రభుత్వ అనుకూల సంఘం వైఫల్యంతో కాలయాపన జరిగిందని, ఈ చర్చల్లో దీనిని సాధించుకోవడం గొప్ప విజయమని తెలిపారు. దీనిని జీర్ణించుకోలేని గత సర్కార్ సంఘం టిబిజికేఎస్ దీనిని ద్రోహపూరిత ఒప్పందం అనడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని, వారు సాధించలేనిది ఏఐటియుసి ఎర్రజెండా సంఘం సాధించిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం సింగరేణికి వచ్చిన లాభాల్లో కార్మికులకు లాభాల వాటాను అతి త్వరలో ప్రకటించి, దసరా పండుగ వరకు ఇప్పించేలా ఒప్పందం చేసుకున్నామని, మిగతా డిమాండ్లు ఉత్తర్వుల రూపంలో ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయని వివరించారు. ఒకపక్క కార్మికులు మంచి ఒప్పందం అని హర్షిస్తుంటే కొన్ని సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌ లను తీసుకువచ్చి వేజ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేయకుండా, 50 శాతం ఓటింగ్ ఉన్న యూనియన్లతో కమిషన్ ఏర్పాటు చేస్తామనడం దుర్మార్గమని, కార్మిక హక్కులను కాలరాసే కుట్ర అని విమర్శించారు. జాతీయ సంఘాలు కలిసికట్టుగా పోరాటాలు చేసి సాధిస్తామని, దీపావళి బోనస్ గత సంవత్సరం కంటే మెరుగ్గా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల హయాంలో ఒక్క నూతన బొగ్గు గని రాలేదని, గుర్తింపు సంఘం ఏఐటియుసి పోరాటాల ఫలితంగా తాడిచర్ల ఓపెన్ కాస్ట్, మణుగూరు డీప్ సైడ్ ఓపెన్ కాస్ట్ గనులు వచ్చాయని, టెండర్ ప్రక్రియ ద్వారా శ్రావణపల్లి ఓసి, సత్తుపల్లి ఓసి లు సైతం అతి త్వరలో సింగరేణికే దక్కనున్నాయని తెలిపారు. ఈసందర్భంగా యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్ లు మాట్లాడుతూ, ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన స్ట్రక్చర్ఊ సమావేశాల వివరాలు, సాధించిన సమస్యలను కార్మికులకు వివరించారు. ఈకార్యక్రమంలో యూనియన్ ఏరియా నాయకులు సోమిశెట్టి రాజేశం, స్ట్రక్చరల్ కమిటీ సభ్యుడు సివి రమణ, గని నాయకులు ప్రేమ్ లాల్, రాంబాబు, సట్ల కొండయ్య, భగవాన్ రెడ్డి, హేమచందు, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్ విక్రమ్ సింగ్, జువాజీ శ్రీనివాస్, సివిల్ పిట్ కార్యదర్శి కలవల శ్రీనివాస్, సేఫ్టీ కమిటీ, మైన్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.