ప్రతిభ ఉన్నా రాణించలేకపోతున్న యువత
క్రికెట్ ఆడేందుకు పక్క ఊర్లకు పరుగులు.. వేల రూపాయల ఖర్చు
సమగ్ర క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి
బద్వేల్,సెప్టెంబర్ 13 ప్రజావాణి నియోజకవర్గమైన బద్వేల్లో క్రీడాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నియోజకవర్గ కేంద్రంలో సరైన క్రీడామైదానం (ప్లేగ్రౌండ్) లేదా అధునాతన స్టేడియం లేకపోవడంతో వేలాది మంది యువతీ యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నప్పటికీ, వారికి కనీస వసతులు కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైదానాలు లేక తమ నైపుణ్యాలను ప్రదర్శించలేక, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో వెనుకబడిపోతున్నామని స్థానిక యువత ఆవేదన చెందుతోంది.
పక్క ప్రాంతాలకు పరుగులు.. జేబులకు చిల్లులు!
బద్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో క్రికెట్కు విపరీతమైన ఆదరణ ఉంది. అయితే, ఇక్కడ మ్యాచ్లు ఆడుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి గ్రౌండ్ కూడా లేదు. దీంతో స్థానిక క్రికెట్ జట్లు మ్యాచ్లు ఆడేందుకు ప్రొద్దుటూరు, మైదుకూరు, నందలూరు, కడప వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడి ప్రైవేట్ లేదా ఇతర మైదానాలను భారీగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకుంటున్నారు. కేవలం ఆటపై ఉన్న పిచ్చితో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, ప్రయాణాల భారాన్ని మోస్తూ క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అన్ని వర్గాల్లోనూ క్రికెట్ క్రేజ్.. కానీ ఆదరణేది?
బద్వేల్ నియోజకవర్గంలో కేవలం విద్యార్థులే కాకుండా అన్ని వర్గాల ప్రజల్లోనూ క్రీడల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంది. ముఖ్యంగా ‘బద్వేల్ క్రికెట్ వెటరన్స్ అసోసియేషన్’తో పాటు స్థానిక డాక్టర్లు, టీచర్లు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా క్రికెట్ జట్లను ఏర్పాటు చేసుకున్నారు. మానసిక ఉల్లాసం కోసం, ఫిట్నెస్ కోసం వీరంతా క్రమం తప్పకుండా మ్యాచ్లు ఆడుతుంటారు. ఇంతమంది క్రికెట్ ప్రేమికులు, వందలాది జట్లు ఉన్న ఈ ప్రాంతంలో ఒక సొంత మైదానం లేకపోవడం ఇక్కడి క్రీడా వ్యవస్థ దయనీయ స్థితికి అద్దం పడుతోంది.బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల (బద్వేల్, గోపవరం, ఖాజీపేట, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, అట్లూరు) క్రీడాకారులకు కేంద్ర బిందువు బద్వేల్ పట్టణమే. ఇక్కడ గనుక ఒక సమగ్ర క్రికెట్ స్టేడియం లేదా క్రీడామైదానాన్ని ఏర్పాటు చేస్తే.. ఏడు మండలాల పరిధిలోని వేలాది మంది గ్రామీణ యువతకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వ స్థలాలను పరిశీలించి, క్రీడల కోసం ప్రత్యేక కేటాయింపులు చేయాలని క్రీడా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.క్రీడలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వాలు పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నా, బద్వేల్ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని క్రీడాకారులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. బద్వేల్ పట్టణ సమీపంలో ఒక సమగ్రమైన క్రికెట్ స్టేడియం లేదా మల్టీపర్పస్ క్రీడామైదానాన్ని యుద్ధప్రాతిపదికన నిర్మించి, తమ ప్రతిభను చాటుకునేందుకు అవకాశం కల్పించాలని నియోజకవర్గ యువత గట్టిగా డిమాండ్ చేస్తోంది.