prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 4:19 pm Digital Edition : PRAJA VANI

108, 102 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ

108, 102 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ

అత్యవసర సేవల్లో వేగం, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: అధికారులు

భూపాలపల్లి, సెప్టెంబర్ 29 మన ప్రజావాణి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజలకు అందుతున్న 108, 102 అంబులెన్స్ సేవలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ శివకుమార్, జిల్లా మేనేజర్ రాజు, స్పెషల్ ఆడిటర్ కిషోర్ ఆధ్వర్యంలో అంబులెన్స్‌లను పరిశీలించారు.

ఈ సందర్భంగా అంబులెన్స్‌లలో అత్యవసర మందులు, వైద్య పరికరాలు, ఇతర ప్రథమ చికిత్స సామగ్రి అందుబాటులో ఉన్నాయా లేదా పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో 108కు కాల్ వచ్చిన వెంటనే స్పందించి, 30 సెకండ్లలోపు అంబులెన్స్‌ను ప్రారంభించే విధంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

రోగికి అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని, ఆ సమయంలో అందించే ప్రాథమిక వైద్యం ప్రాణాలను కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. అంబులెన్స్ సిబ్బంది రోగులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వేగవంతమైన మరియు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.

అలాగే 102 అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, అవసరమైన మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 108, 102 అత్యవసర సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఈ తనిఖీలో 108, 102 అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.