•హామీల అమలుకు డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పోరు
•బీహెచ్‌ఈఎల్ నుంచి ఇస్నాపూర్ వరకు ఆటోల ర్యాలీ
•కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి ధ్వజం
పటాన్‌చెరు, సెప్టెంబర్ 6 (ప్రజావాణి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గంలో శనివారం నిరసన కార్యక్రమాలు ఉధృతంగా నిర్వహించారు. పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
బీహెచ్‌ఈఎల్ చౌరస్తా నుంచి ఇస్నాపూర్ చౌరస్తా వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు తాగునీరు, వీధి దీపాలు, మెరుగైన శాంతిభద్రతలు, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కనీస అవసరాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు విమర్శించారు.
అనంతరం ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలో నిరసన సభ నిర్వహించారు. ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, విద్యార్థులకు స్కూటీలు, దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాల్లో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, దివ్యాంగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.