*హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి*
*అదనపు కలెక్టర్, డిఆర్డిఓ లకు వినతి – ధాన్యం కొనుగోళ్లకు ముందే యూనియన్ తో సమావేశం నిర్వహించాలని డిమాండ్*
జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి):
జిల్లాలోని హమాలీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డిఆర్డిఓ ఆర్. భాస్కర్ లకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు గారు మాట్లాడుతూ.
జిల్లాలో హమాలీ యూనియన్ ప్రతినిధులతో ఎలాంటి చర్చలు జరపకుండా ఐకేపీ నిర్వాహకులు ఏకపక్షంగా ఒప్పంద పత్రాన్ని తయారు చేసి, హమాలీ కార్మికులతో బలవంతంగా సంతకాలు చేయించడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభానికి ముందే ప్రభుత్వం, ఐకేపీ నిర్వాహకులు హమాలీ యూనియన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రేట్లు, పని పరిస్థితులు, ఇతర సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, గోదాముల్లో హమాలీ కార్మికులు అత్యంత కష్టతరమైన శారీరక శ్రమ చేస్తూ ధాన్యం సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయితే వారికి తగిన సామాజిక భద్రత, ప్రమాద రక్షణ, సంక్షేమ సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
*ప్రధాన డిమాండ్లు:*
– హమాలీ కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
– హమాలీ కూలీ డబ్బులను రైతుల నుంచి వసూలు చేయకుండా, ప్రభుత్వమే నేరుగా చెల్లించాలి.
– పని ప్రదేశంలో ప్రమాదానికి గురైన వారికి వైద్య సదుపాయం కల్పించాలి, మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.
– పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, భోజన వసతి కల్పించాలి, వెంటనే రెండు జతల యూనిఫాంలు ఇవ్వాలి.
– ఇండ్లు లేని హమాలీలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.
– హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సామాజిక భద్రతా చట్టం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.

హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు బైరగోని బాలరాజు, నాయకులు గజ్వేల్లి రమేష్, కొంగరి నర్సయ్య, మద్దూరి యాదగిరి, పెండ్యాల శ్రీనివాస్, షాడ వెంకటయ్య, కిష్టయ్య, దస్తగిరి, నరసయ్య, కేమిడి యాదగిరి, నోముల సంపత్, డి. రమేష్, ఈ. శ్రీనివాస్, గణేష్, లింగయ్య, డి. రాజు తదితరులు పాల్గొన్నారు.