prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 4:42 pm Digital Edition : PRAJA VANI

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యం

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యం*

*15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏం చేశాడో ఆలోచించాలి – మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి):
జిల్లా లోని లింగాల ఘనపూర్ మండలం, వనపర్తి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి, రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత కొత్తపల్లి గ్రామంలో రూ.37.50 లక్షలతో నిర్మించిన పలు సీసీ రోడ్లను ప్రారంభించి, నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..

ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి చేయాలనే తపనతో పని చేస్తున్నానని, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏం చేశాడో ఒకసారి ఆలోచించాలని, నేను ఎమ్మెల్యే అయిన ఈ 3 ఏళ్లలో ఏ రకంగా అభివృద్ధి పనులు చేస్తున్నానో మీరు చూస్తున్నారని అన్నారు.

నా 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరి దగ్గర ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని, నిజాయితీగా పని చేయడం మాత్రమే నాకు తెలుసని అన్నారు. నిజాయితీగా ఉంటూ ప్రజల కోసం కష్టపడి పని చేసే వారికే ప్రజల సహకారం ఉండాలని అన్నారు.

24 ఏళ్ల క్రితం తాను శంకుస్థాపన చేసిన kదేవాదుల ప్రాజెక్టు నేడు పూర్తయి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని, దేవాదుల పేరు చెబితే కడియం శ్రీహరి గుర్తుకువస్తారని తెలిపారు. లింగాల ఘనపూర్ మండలంలోని ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

*బీజేపీ, బీఆర్ఎస్ లపై విమర్శలు:*

బీజేపీ, బీఆర్ఎస్ లు కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకుని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, తెలంగాణ ఏర్పాటునే బీజేపీ, ప్రధాని మోడీ తప్పు పట్టారని అన్నారు. వనరులను దోచుకున్న బీఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

వనపర్తి గ్రామ అభివృద్ధికి 3 ఏళ్లలో రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశానని, కొత్తపల్లి నుండి డిక్య తండా వరకు రూ.85 లక్షలతో రోడ్డు, కొత్తపల్లి నుండి లింగాల ఘనపూర్ వరకు హ్యామ్ పథకం కింద రూ.9 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి, కొత్తపల్లి గ్రామాల సర్పంచులు వంచ శైలజ ఉపేందర్ రెడ్డి, గాదెపాక విష్ణు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు గుడి వంశీధర్ రెడ్డి, దిలీప్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శివ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ మనోహర్, వివిధ గ్రామాల సర్పంచులు, తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.